సుభాష్‌నగర్(కరీంనగర్) : కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో తెరాస ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెడుతూ పాలన సాగిస్తున్నాయని తెపీసీసీ అధికార ప్రతినిధి కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం కరీంనగర్‌లో రాష్ట్ర కార్యదర్శి వైద్యుల అంజన్‌కుమార్‌తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో భాజపా ఒక్క జడ్పీటీసీ స్థానాన్ని గెలవలేదని, హుజూర్‌నగర్‌లో డిపాజిట్ సాధించలేని ఆ పార్టీ ఎంపీ కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థులు లేక ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు 39 రోజులుగా సమ్మె చేస్తున్నా ఇందులో 30శాతం వాటా ఉన్న కేంద్రం కనీసం స్పందించడం లేదన్నారు. ఎంపీగా ఎన్నికైనప్పటి నుంచి నగరాన్ని ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్న రెండు పార్టీలు ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నాయని ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వివరించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయకేతనం ఎగరవేస్తుందని అన్నారు. సమావేశంలో నాయకులు మాచర్ల ప్రసాద్, తాజుద్దీన్, రవి, బీరయ్య, అబ్దుల్ రహ్మన్, ఖమ్రుద్దీన్, ఇమ్రాన్, భాస్కర్ తదితరులున్నారు.