కాచిగూడ నుంచి మళ్లీ రైళ్ల రాకపోకలు

కాచిగూడ రైల్వేస్టేషన్ నుంచి మంగళవారం యథావిధిగా రైళ్ల రాకపోకలు ప్రారంభమయ్యాయి. సోమవారం ఉదయం కర్నూలు-హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా వెళ్తున్న ఎంఎంటీఎస్ రైలు ఎదురెదురుగా ఢీకొనడంతో కాచిగూడ స్టేషన్ నుంచి వెళ్లే రైళ్లను పూర్తిగా రద్దుచేసిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ధ్వంసమైన ట్రాక్ పునరుద్ధరణ ప్రక్రియ సోమవారం అర్ధరాత్రే మొదలయింది. 13 విభాగాలకు చెందిన దాదాపు 600 మంది సిబ్బంది ఉదయం 10.45 గంటల కల్లా కొన్ని పనులు పూర్తిచేయడంతో తొలుత డీజిల్ ఇంజిన్‌తో నడిచే రైళ్ల రాకపోకలను ప్రారంభించారు. ప్రమాదం తర్వాత తొలిగించిన ఓవర్‌హెడ్ ఎక్విప్‌మెంట్ (ఎలక్ట్రిసిటీ) పనులను కూడా మధ్యాహ్నం ఒంటి గంటకు పూర్తిచేసి అన్ని రైళ్లు నడిచేందుకు వీలుగా ట్రాక్‌ను సిద్ధంచేయడంతో లింగంపల్లి-ఫలక్‌నుమా ఎంఎంటీఎస్ రైలు సాయం త్రం 4.15కు కాచిగూడ స్టేషన్‌కు వచ్చింది. అయితే ఆ రైలులో ఒక్క ప్రయాణికుడు కూడా ఎక్కకపోవడంతో ఖాళీగా ఫలక్‌నుమాకు వెళ్లింది. ఈ ప్రమాదం వల్ల రూ.8 కోట్ల నష్టం వాటిల్లినట్టు అంచనా వేశారు.