ముంబయి: మహారాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ, అనూహ్య పరిణామాలు ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలిపిస్తున్నాయి. అధికార పీఠం.. వివిధ పార్టీల మధ్య దోబూచులాడుతోంది. భాజపా మద్దతు లేకుండా ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల తోడ్పాటుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సేనకు మద్దతు ఇచ్చే అంశంపై ఎన్‌సీపీతో మరిన్ని చర్చలు జరపాల్సి ఉందని కాంగ్రెస్ చల్లగా చెప్పడంతో అయోమయం మరింత పెరిగింది. దీంతో ఈసారి అవకాశం ఆ తర్వాతి స్థానంలో ఉన్న ఎన్‌సీపీకి లభించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా సంసిద్ధత వ్యక్తంచేయాలని గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీ ఆ పార్టీకి సూచించారు. కేంద్రంలో శివసేన మంత్రి కూడా రాజీనామా చేశారు.
288 మంది సభ్యులున్న మహారాష్ట్ర అసెంబ్లీలో 56 స్థానాలతో రెండో స్థానంలో నిలిచిన శివసేనను ప్రభుత్వం ఏర్పాటుపై సంసిద్ధతను తెలియజేయాలంటూ గవర్నర్ ఆదివారం ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రం 7.30 గంటల లోపు స్పందన తెలియజేయాలని ఆయన కోరారు. ఎన్నికల్లో 105 స్థానాల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా.. సర్కారును ఏర్పాటు చేయలేమని గవర్నర్‌కు చెప్పడంతో సేనకు ఆహ్వానం అందింది. దీంతో శివసేన ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ల మద్దతును కోరింది. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌కు కలిపి 98 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు 145 మంది సభ్యుల మద్దతు అవసరం. మూడు పార్టీలు కలిస్తే 154 మంది ఎమ్మెల్యేల మద్దతు సమకూరినట్లవుతుంది. ఈ నేపథ్యంలో సోమవారం మూడు పార్టీల మధ్య జోరుగా సమావేశాలు, ఫోన్ సంభాషణలు జరిగాయి. సేనకు మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమ్మతి తెలిపారని, ఈ మేరకు ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌కు స్పష్టంచేశారని వార్తలు వచ్చాయి. ఇక మూడు పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటు లాంఛనమేనని అందరూ భావించారు. అయితే శివసేనకు గవర్నర్ ఇచ్చిన గడువు ముగియడానికి కొద్దిసేపటి ముందు.. మహారాష్ట్రలో పరిస్థితులపై ఎన్‌సీపీతో మరిన్ని చర్చలు జరపాల్సి ఉందంటూ కాంగ్రెస్ చేసిన ప్రకటనతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ''ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో సోనియా మాట్లాడారు. ఆ పార్టీతో మరిన్ని చర్చలు జరుపుతాం'' అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం శివసేన నేతలు ఏక్‌నాథ్ శిందే, ఆదిత్య ఠాక్రేలు గవర్నర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమేనని ప్రకటించారు. సరిపడా సంఖ్యలో ఎమ్మెల్యేలను కూడగట్టడానికి మూడు రోజుల గడువును కోరారు. దీనికి గవర్నర్ తిరస్కరించారు. అనంతరం రాజ్‌భవన్ నుంచి ఎన్‌సీపీకి పిలుపు వచ్చింది.